-ఆ చౌక ప్లాన్ నిలిపివేత.. ఇకపై కనీస రీఛార్జ్ ఎంతంటే..
న్యూఢీల్లీ,నవంబర్11 : దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ సిమ్ యూజర్లకు ఊహించని ఝలక్ ఇచ్చింది. జియో తర్వాత అత్యధికంగా కస్టమర్లను కలిగి ఉన్న ఈ ప్రైవేట్ టెలికాం సంస్థ ఎంట్రీ లెవెల్‌లో అత్యంత చౌకగా లభించే రీఛార్జ్ ప్లాన్ నిలిపివేసింది. దీంతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ యూజర్లు ఇకపై అత్యధికంగా చెల్లించాల్సి వస్తుంది. రూ.189తో కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చిన ఈ ఎంట్రీ లెవెల్ అన్‌లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్లో కనిపించడం లేదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ ఏడాది 2025, జూలైలోనే రూ.189 ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఇది ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్. అయితే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్లో ఈ రూ.189 ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్ కనిపించడం లేదు. ప్రధానంగా వాయిస్ సర్వీసుల కోసం ఎక్కువగా ఉపయోగించే వారు, తక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండేది. రూ.189 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 21 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే, ఈప్లాన్ ఇక లేదు.అలాంటి ఎంట్రీ లెవెల్ ప్లాన్ కావాలనుకునే వారు ఇకపై రూ.199తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూ.199 ప్లాన్‌తో 29 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటాతో పాటుగా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. దీని తర్వాత కాస్త డేటా ఎక్కువ లభించే చౌక ప్లాన్‌గా రూ.219 ప్లాన్ ఉంది.మరోవైపు.. ప్రజలు ఎక్కువ డేటా ఉపయోగించుకునేందుకు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు చౌక ప్లాన్లను తొలగిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వినియోగదారులు తరుచు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండేందుకు వీలుపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అందిస్తోన్న ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను సైతం పరిమితం చేయాలని టెలికాం కంపెనీలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగినట్లయితే యూజర్లు మునుపటి మాదిరిగా ఇంటర్నెట్ వినియోగించడం కుదరదు. ఖరీదైన డేటా ప్లాన్ కొనుగోలు చేయాల్సి రావచ్చు.