- 2026–27 రెండేళ్ల కాలానికి జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం
అమరావతి, నవంబర్ 10 : ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026–2027 రెండేళ్ల కాలానికి అక్రిడిటేషన్లు జారీ ప్రక్రియను పారదర్శకంగా, సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మీడియా రిలేషన్స్ పోర్టల్ను సోమవారం రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి లాంఛనంగా ప్రారంభించారు.
సచివాలయంలోని ప్రచార విభాగంలో జరిగిన కార్యక్రమంలో సమాచారశాఖ సంచాలకులు కే.ఎస్. విశ్వనాథన్‌తో కలిసి ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో, రాబోయే రెండు సంవత్సరాల కాలానికి కొత్త అక్రిడిటేషన్ల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకు అర్హులైన జర్నలిస్టులు ఈ పోర్టల్‌లో తమ వివరాలను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన ప్రతి ప్రతినిధి, తన అప్లికేషన్ ఏ దశలో ఉందో కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకునే సౌకర్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియపై పూర్తి మార్గదర్శకాలు మంగళవారం ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మీడియా–ప్రభుత్వ అనుసంధానాన్ని సాంకేతికతతో మరింత బలోపేతం చేయడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.