న్యూఢిల్లీ, నవంబర్ 6 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి):
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు పొట్టి సిరీస్‌లో ముందంజ వేసింది. కీలకమైన నాలుగో టీ20లో సమిష్టి ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. శుభ్‌మన్ గిల్ (46) సాధికారిక ఇన్నింగ్స్‌కు అక్షర్ పటేల్(21 నాటౌట్ 2-20) ఆల్‌రౌండ్ షో తోడవ్వగా ఆసీస్‌ను 48 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచి తడబడిన కంగారూ టీమ్.. సుందర్ (3-3) విజృంభణతో 119కే ఆలౌటయ్యింది. భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.పేస్, బౌన్సీ పిచ్‌లతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే ఆస్ట్రేలియాను స్పిన్ అస్త్రంతో దెబ్బకొట్టింది భారత జట్టు. సిరీస్‌లో కీలకమైన నాలుగో టీ20లో భారీ స్కోర్‌తో కంగారూలకు పరీక్ష పెట్టిన టీమిండియా.. ఆ తర్వాత బంతితో చెలరేగింది. టాపార్డర్ శుభారంభం ఇచ్చినా.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్(2-20), వాషింగ్టన్ సుందర్(3-3)లు తిప్పేయగా ఆతిథ్య జట్టు బ్యాటర్లు వరుసగా డగౌట్ చేరారు. పవర్ హిట్టర్ స్టోయినిస్(17)ను సుందర్ ఎల్బీగా వెనక్కి పంపగా ఆసీస్ ఓటమి ఖాయమైంది.భారత్ నిర్దేశించిన 168 పరుగుల భారీ ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే అక్షర్ పటేల్ షాకిచ్చాడు. దంచికొడుతున్న
డేంజరస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్(25)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో.. పరుగలు వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసకొని టీమిండియా అతడి వికెట్ సాధించింది. ఆతర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(10) బుమ్రా ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. దాంతో.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆసీస్ 48 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే ఇంగ్లిస్ అక్షర్ పటేల్ ఓవర్లో బౌల్డ్ కాగా.. దూకుడుగా ఆడుతున్న కంగారూ కెప్టెన్ మిచెల్ మార్ష్(30)ను దూబే ఔట్ చేసి పెద్ద బ్రేకిచ్చాడు. అతడి ఓవర్లో పెద్ద షాట్ ఆడిన మార్ష్ బౌండరీ వద్ద అర్ష్‌దీప్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.70కే మూడు వికెట్లు పడిన వేళ టిమ్ డేవిడ్(14), ఫిలిప్పే(10)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, వీరిద్దరూ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. డేంజర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(2)ను వరుణ్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. సుందర్ ఓకే ఓవర్లో స్టోయినిస్(17)ను ఎల్బీగా.. బార్ట్‌లెట్‌ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. బుమ్రా ఒక వికెట్ తీయగా.. సుందర్ ఓవర్లో జంపా గిల్ చేతికి చిక్కగా కంగరూ టీమ్ 119కే ఆలౌటయ్యింది. 48 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది.
గిల్, అక్షర్ పోరాడగా..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేదు. మిడిలార్డర్ చేతులెత్తేగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి167 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(28) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న గిల్.. ఎట్టకేలకు క్రీజులో నిలిచి జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్‌లో శివం దూబే(22), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(20)లు ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అక్షర్ పటేల్(21 నాటౌట్) ధనాధన్ ఆడడంతో టీమిండియా పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
Sports
ఆస్ట్రేలియా పై భారత్ విజయం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.