విప్లవ యోగి బ్రహ్మం గారి 417 వ జయంతి సందర్భంగా యావన్మంది బ్రహ్మం గారి భక్తులు కు శుభాకాంక్షలు!!
చిన్నదో పెద్దదో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి... వారి దేవాలయం లేని వూరంటూ తెలుగు రాష్ట్రాల్లో లేకుండా వుండదు..అంతగా మన హృదయాల నిండా బ్రహ్మంగారు అని కొలుచుకుంటున్నాము..
"పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు
హృదయ సంపుటములు చదువవలయు."॥
నాలుగు వందల ఏండ్ల క్రితమే అచ్చ తెలుగు లో రాసిన చురకత్తులాంటి విప్లవభావాలు వీరబ్రహ్మేంద్రస్వామి వారివి.
" ఆకలి అయినవాడికే అన్నం విలువ తెలుస్తుంది. అణగదొక్కబడ్డ వాడికే గుండె మండి "మాట" తూటాలుగా పేలుతుంది. తోటి అణగారిన మనుషులను తన నీడలో సేదదీర్చే మనసుంటుంది.వారి హక్కులు ను గుర్తుచేస్తూ ఉద్యమ కార్యాచరణ మార్గం ఎన్నుకుంటుంది. ఎక్కడో ఈ మాటలు విప్లవ కమ్యూనిస్టు నాయకుల వేదిక లను గుర్తు చేస్తున్నాయి కదూ..ఆనాడే తన రచనలు,బోధనలు ద్వారా సమసమాజం కోసం మేలుకొలుపులు పాడిన విప్లవయోగి బ్రహ్మం గారి భావజాలం అనిపిస్తుంది..
చరిత్ర లో లిఖించబడిన సాహిత్య కారులకన్నా ఎన్నో ఏండ్ల ముందే ముత్యాల సరాలు , ఆటవెలది,కంద పద్యాలలో సూటిగా ,గుండెకు హత్తుకునే విధంగా,నేటికి జనం నాలుకపై చిందుతొక్కేల అభ్యుదయ భావాలు తో కాళికాంబ పద్యాలు, తత్వాలు,ద్విపదలు, వచనం, ఒకటనేమిటి వివిధ ప్రక్రియల లో తుఫాను మేఘంతో ఢమఢమల మోతలతో ఝంఝం మారుతంలా ప్రవహింపజేసిన సాహిత్యకారుడు
వీరబ్రహ్మేంద్రస్వామివారు, మన ఆధునిక సామాజిక కవులు కంటికి కనిపించలేదు.
అచ్చ తెలుగు కవి, ఆధునిక సాహిత్య నిర్మాత ,ఆదికవులంటూ కొందరుని నెత్తి కెత్తుకున్నారే కానీ కుల ద్వేషం నరనరాన నిండిన మలపలకు బ్రహ్మంగారు ఆయన సమాజ ధిక్కార శబ్ధం భయం కలిగించి వుంటుంది అనడంలో అతిశయోక్తికాదు.
"దారి నడుచునట్టి వారికెల్లరకును హక్కులొక్కటేయంచు ఋక్కు పలికె" ,(వేదం)
" గుండె గూటిలోన గూర్చున్న యాత్మను" "సాటిమానవునకు సాయమ్ము పడపోక ,"
"కూడు తినెడి కాడ కులభేధమేలనో"
ఒకటా రెండా వందలాది అభ్యుదయ వాక్యాలు కాళికాంబ సప్తశతి,వీరకాళికాంబ శతకం, సిధ్ధగురుభోధ,తత్వగీతాలు, కాలజ్ణాన వాక్యాలు మొదలుగు రచనలలో రచించి విప్లవ శంఖం మోగించిన క్రాంతి దర్శకుడు బ్రహ్మం గారు..
అసలు బ్రహ్మంగారి సాహిత్యం చదివితే /వింటేనే కదా బ్రహ్మం గారిలోని విప్లవ భావాలను తడిమేది ఎవరైనా, పండితులనే వర్గం కళ్ళున్న కబోదులయారు. సామాన్య భక్తులకు ఆధ్యాత్మిక అమృతవాహిని తో దేవుడయ్యాడు.
"గుండె గూడు," "హక్కు," హృదయ సంపుటములు, లాంటి పదాల ముల్లుకర్ర చేబూని ,చేతలతో ,ఆచరణలో అణగారిన వర్గాలకు ఆపధ్భాందవుడై, తోడుగా వున్నందునే భగవంతుని రూపంలో పూజిస్తున్నారు.
ఓ ప్రక్క బ్రాహ్మణ భావజాలం, ఇంకోవైపు మత విద్వేషాలు, కులాల అంతరాలు, చదువులపై ఆంక్షలు,స్త్రీల పై కట్టుబాట్లు, మూఢనమ్మకాలు,అన్ని సమస్యలను ఎదుర్కొని మతోన్మాద రాజకీయమ్మన్యులు,పండితులపై ఎక్కుపెట్టిన గండ్రగొడ్డలి వీరబ్రహ్మేంద్రస్వామి కవిత్వం...
చండ్ర నిప్పులు కొలిమిలో, అంట కాగి, పదును తేలిన కత్తి వాదర బ్రహ్మం గారు, భాధిత ప్రజల గుండె గొంతుక బ్రహ్మం గారు..
చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిన కాలంలో" చేత" "మాట" ఒకే విధంగా ఆథ్యాత్మిక మార్గంలో నడిచి నడిపించిన బ్రహ్మంగారు సకల జనానికి భగవంతుడు అయ్యాడు.. ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న బ్రహ్మం గారు ఆనాడు ఈనాడు భగవత్స్వరూపమే...
విప్లవ యోగి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి సందర్భంగా.జేజేలు..
జయహో వీరబ్రహ్మం.. జయతు జయతు జేజి నాయన...
నల్లూరి రామప్రసాదాచారి.నడికూడి